రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందు రోజు గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్న సమయంలో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెదేపా ఎమ్మెల్యేసండ్ర వెంకట వీరయ్య ఇద్దరూ ఆయనకు ఆటంకం కలిగించారనే కారణంతో వారిరువురినీ ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు శాసనసభ నుంచి సభ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసిపోయాయి కానీ దానిపై రేవంత్ రెడ్డి పంచాయితీ ఇంకా ముగియలేదు. తమని సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అందులో ఆయన ఒక లా పాయింట్ లేవనెత్తారు. గవర్నర్ నిర్వహిస్తున్న సభలో స్పీకర్ తో సహా ఎవరికీ అధికారం ఉండదని, ఉంటుందని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. కనుక గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో శాసనసభలో జరిగే పరిణామాలను నియత్రించడానికి స్పీకర్ కు ఎటువంటి అధికారాలు ఉండవని, కనుక తమను సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం కూడా స్పీకర్ కు లేదని వాదించారు. ఆయన వాదనను పరిగణనలోకి తీసుకొన్న న్యాయస్థానం స్పీకర్ మధుసూదనాచారికి, శాసనసభ కార్యదర్శికి నోటీసులు పంపించింది. దీనిపై 10 రోజులలో వివరణ ఇవ్వాలని కోరింది.