త్వరలో ఏపి మంత్రివర్గ విస్తరణ

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ఉదయం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కనుక ఇక మంత్రి పదవి చేపట్టడమే మిగిలుంది. దానికి చంద్రబాబు నాయుడు ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 2 లేదా 6వ తేదీన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చని తాజా సమాచారం. ఆయనతో బాతి దివంగత వైకాపా ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు కూడా మంత్రివర్గంలోకి తీసుకొబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్నవారిలో కొందరు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకరిద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తమ సమర్ధత నిరూపించుకోలేకపోతున్నారు. ఒకరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరో రెండేళ్ళలో ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది కనుక వారిని తొలగించి వారి స్థానాలలో యువతను కొందరు సీనియర్లకు అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ సామర్ధంపై పార్టీలో, ప్రజలలో నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు చంద్రబాబు తన కుమారుడుకి కీలమైన భాద్యతలు అప్పగించాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. కనుక నారా లోకేష్ ఎవరి పదవికి ఎసరు పెట్టబోతున్నారో మరో వారం రోజులలోనే తెలిసిపోతుంది.