“మీకు అవసరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నాకు రోజుకు రూ.811 చొప్పున నెలకు రూ.24,340 జీతం ఇస్తోంది. కనుక మీరు నా నుంచి సేవలు పొందేందుకు లంచం ఈయనవసరం లేదు. మీకు నేను అందిస్తున్న సేవల పట్ల అసంతృప్తి చెందితే దయచేసి నాకు తెలియజేయగలరు.”
ఇది కేరళలోని మల్లపురం జిల్లాలోని అంగడిపురం గ్రామపంచాయితీ కార్యాలయంలో అబ్దుల్ సలీం పల్లియల్ తొడి అనే ఒక గుమస్తా బల్లపై కనిపించే నోటీసు. మరో విశేషం ఏమిటంటే, అబ్దుల్ సలీం తన జీతం పెరిగిన ప్రతీసారి తన బల్లపై పెట్టిన ఆ నోటీసు బోర్డులో తన ఆదాయ వివరాలను కూడా సరిచేస్తుంటారు. ఆయన గత మూడు సం.లుగా ఆ కార్యాలయంలో పని చేస్తున్నారు. అక్కడ జేరిన మొదటి రోజునే తనపై అధికారుల అనుమతితో ఆ నోటీసు బోర్డును తన బల్లపై ఏర్పాటు చేసుకొని చాలా నిజాయితీగా ప్రజలకు సేవలందిస్తున్నారు. వివిధపనుల కోసం ఆ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆయన నిజాయితీని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఆయన ప్రభావం మిగిలిన ఉద్యోగులపై కూడా పడటం సహజమే కనుక అందరూ అటువంటి బోర్డులు పెట్టుకోకపోయినా నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తుండటంతో కేరళలో ఆ పంచాయితీ కార్యాలయం ఒక ప్రత్యేక గుర్తింపును స్వంతం చేసుకొంది.