ఖమ్మం జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా మొక్కలునాటి పచ్చదనం పెంపొందించినందుకు వనజీవి దరిపల్లి రామయ్యకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 30వ తేదీన రాష్ట్రపతి భవన్ లో జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆ అవార్డును అందుకొనేందుకు ఆయన తన అర్ధాంగి జానమ్మ, కుమారులు, మనవలు, కోడలు, ఒక సహాయకుడుతో కలిసి సోమవారం ఏపి ఎక్స్ ప్రెస్ రైల్లో డిల్లీకి బయలుదేరారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామంలో తనను కలిసేందుకు వచ్చిన మీడియాతో చెప్పిన మాటలు ఒక ఉన్నత విద్యావంతుడికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ఏదైనా ఒక లక్ష్యం నిర్దేశించుకొని దాని కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. అయితే ఏదో ఫలితం, ప్రతిఫలం ఆశించి చేయడం కంటే, ఎంచుకొన్న పనిని చిత్తశుద్ధితో చేసినప్పుడే మంచి ఫలితం వస్తుందని చెప్పారు. తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం లభిస్తే, దేశవ్యాప్తంగా మొక్కలు పెంచడానికి తగిన చర్యలు చేపట్టాలని అడుగుతానని చెప్పారు. మన కరెన్సీని గ్రీన్ కరెన్సీగా మార్చినట్లయితే ప్రపంచదేశాలలో దానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని అన్నారు. ఇక్కడి నుంచి సీతాఫలం, ఎర్రచందనం, శ్రీగందం వంటి మొక్కలను డిల్లీకి తీసుకు వెళుతున్నానని, రాష్ట్రపతి అనుమతిస్తే రాష్ట్రపతి భవన్ లో వాటిని నాటాలనుకొంటున్నానని చెప్పారు. ఈ అవార్డు కంటే పచ్చగా పెరిగి కళకళ లాడుతున్న మొక్కలే తనకు ఎక్కువ సంతోషం కలిగిస్తాయని చెప్పారు. విదేశాలలో పెరిగే కొన్ని మొక్కలను మన దేశానికి రప్పించి ఇక్కడ కూడా పెంచాలని తాను ప్రధాని మోడీని కోరుతానని చెప్పారు. ఈ అవార్డు తనకు మొక్కల వలనే వచ్చింది కనుక దానిని వాటికే అంకితం చేస్తానని చెప్పారు.
పచ్చదనం కోసం ఇంతగా పరితపిస్తూ దాని కోసం తన జీవితాన్నే ధారపోసిన మన మొక్కల రామయ్య ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. కనుక రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తెరాస సర్కార్ ఆయన సేవలను ఉపయోగించుకొని గౌరవవేతనం అందిస్తే ఆయనను గౌరవించినట్లు ఉంటుంది. అలాగే ఆయన కృషితో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతుంది కదా!