కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి ఇవ్వాళ్ళ తెరాస సర్కార్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ కి మేము చెప్పే సలహాలు, చేస్తున్న హెచ్చరికలు చెవికెక్కించుకోవడం లేదు. ఆయన మా మాటలు వినేందుకు ఇష్టం లేకపోయినా కనీసం కాగ్ చేసిన హెచ్చరికలైనా చెవికెక్కించుకొంటే మంచిది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి, అది రూపొందించిన బడ్జెట్ కి ఎక్కడా పొంతనలేదు. అప్పులు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయమన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారు. కానీ మన ఆదాయం, ఆస్తులను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు అప్పులు తెచ్చి ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తే తరువాత ఆ భారం ప్రజలపైనే పడుతుందని కేసీఆర్ మరిచిపోకూడదు.
దేనికైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. దాని ప్రకారం ముందుకు సాగినప్పుడే పనులు సజావుగా సాగుతుంటాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వానికి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా తోచినట్లు చేసుకుపోతోంది. ప్రతీ బడ్జెట్ లో గొప్ప గొప్ప పధకాలు ప్రకటించేయడం వాటిని అమలుచేయలేక చతికిలపడటం తెరాస సర్కార్ కు అలవాటుగా మారింది. 2015-15 బడ్జెట్ లో అది ప్రకటించిన అనేక పధకాలను నేటికీ అమలుచేయలేకపోవడమే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగ్ నివేదికలో కూడా అదే పేర్కొంది. తెరాస సర్కార్ చేపట్టిన పనులలో అనేక అవకతవకలను కాగ్ తన నివేదికలో ఎండగట్టింది. అదే మాట మేము చెపుతుంటే, కేసీఆర్ మా గొంతు నొక్కేస్తున్నారు. ప్రతిపక్షాలు అంటే తమ రాజకీయ ప్రత్యర్దులుగా మాత్రమే చూడకుండా వారు ప్రజల గొంతునే ప్రభుత్వానికి వినిపిస్తున్నారనే సంగతి కేసీఆర్ గ్రహించాలి. మేము చెపుతున్నది తప్పే అనుకొందాము మరి కాగ్ కూడా అదే చెప్పింది కదా. కాగ్ నివేదికపై అయన ఏమి సమాధానం చెపుతారు?
కేసీఆర్ తన ప్రభుత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. సంతోషమే..కానీ తెరాస సర్కార్ గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో కూడా ఆయన కొంచెం తెలుసుకొంటే చాలా మంచిది. ఆయన ఇప్పుడు మా గొంతులను నొక్కేయగలిగినా వచ్చే ఎన్నికలలో ప్రజలే ఎవరికి అధికారం కట్టబెట్టాలో నిర్ణయిస్తారు,” అని జానారెడ్డి అన్నారు.