ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలి

అతిపెద్ద విద్యాసంస్థల అధినేత ప్రభుత్వంలో కీలక మంత్రిగా, ఆయన వియ్యంకుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏమి జరుగుతుంది? అంటే ఏమైనా జరుగవచ్చని వైకాపా వాదిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా వ్యాపించి ఉన్న నారాయణ విద్యాసంస్థలపై...వాటి అధినేత, మున్సిపల్ శాఖా మంత్రి నారాయణపై, ఆయన వియ్యంకుడు, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావులపై ఈరోజు వైకాపా శాసనసభ సాక్షిగా యుద్ధం ప్రకటించింది.

ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనంతపురం, నెల్లూరు జిల్లాలలో గల నారాయణ కళాశాలలో 10వ తరగతి పరీక్షా పత్రాలలో ప్రశ్నలను మంత్రి నారాయణకున్న పలుకుబడితో ఆ సంస్థల ప్రతినిధులు ముందుగానే సంపాదించి, వాటిని రాష్ట్రంలో తమ ఇతర బ్రాంచీలకు వాట్స్ ఆప్ ద్వారా పంపించారని వైకాపా సభ్యులు ఆరోిపించారు. కనుక వారిద్దరినీ తక్షణమే పదవులలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైకపా సభ్యులు నేడు ఏపి శాసనసభను స్తంభిపజేశారు.

ఈ సమస్యపై చర్చించేందుకు తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై సభలో చర్చకు అనుమతించాలని కోరుతూ వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. కానీ తెదేపా ప్రభుత్వం యధాప్రకారం వారి ఆరోపణలను తేలికగా కొట్టిపడేసి సభాకార్యక్రమాలను కొనసాిగించింది. 

ఏపి బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి వైకాపా రోజుకొక సరికొత్త సమస్యను సభ ముందు ఉంచి దానిపై సభలో చర్చ  జరపాలని  పట్టుబడుతూ నినాదాలు చేస్తుండటం, వాటిని తెదేపా సభ్యులు తేలికగా తీసిపడేస్తుండటం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రజాసమస్యల పేరిట రెండు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటున్నారే తప్ప  ఏ ఒక్క సమస్యను పరిష్కరించేందుకు ఇరు పక్షాలు చొరవ చూపకపోవడం విశేషం. ఈ గొడవల కారణంగా ప్రజా సమస్యలపై సభలో ఎటువంటి జరుగకుండానే ముగిసిపోయేలా కనిపిస్తున్నాయి.