నిర్భయకేసు ఇంకెన్నేళ్ళు సాగుతుందో?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు ఉరి శిక్ష విదించిన సంగతి తెలిసిందే. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో ఆ సంఘటన జరిగి, దోషులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినప్పుడు కేవలం రెండు నెలలోనే వారికి శిక్షలు పడటం ఖాయం అని చాలా మంది న్యాయవాదులు బల్లగుద్ది వాదించారు. కానీ నేటికీ ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం. తమకు ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ నలుగురు దోషులు వేసుకొన్న రివ్యూ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తన తీర్పును రిజర్వ్ లో ఉంచి, వారం రోజులలోగా దానిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. 

నిర్భయకేసులో ఒక మైనర్ తో సహా ఆరుగురిని దోషులుగా కోర్టు నిర్దారించింది. వారిలో ఒకడు మైనర్ అయినందున మూడేళ్ళు బాలల పునరావాస కేంద్రంలో ఉండి ఎటువంటి శిక్ష అనుభవించకుండానే వెళ్ళిపోయాడు. మరొకడు తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకొన్నాడు. అప్పటి నుంచి చట్టంలో ఉన్న లొసుగులు లేదా ఉన్న అన్ని అవకాశాలను మిగిలిన నలుగురు దోషులు చాలా తెలివిగా ఉపయోగించుకొంటూ ఇన్నేళ్ళు ఉరిశిక్ష పడకుండా నెట్టుకొచ్చేశారు. ఉగ్రవాదులకు తప్ప మరెవరినీ ఉరి తీయకూడదనే ప్రతిపాదనలు కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉంది కనుక ఒకవేళ ఈ నలుగురు దోషులు మరికొన్నాళ్ళు ఈ ఉరిశిక్షను వాయిదా వేసుకోగలిగితే వారు కోరుకొన్నట్లుగానే యావజీవ కారాగార శిక్షతో బ్రతికిబయటపడవచ్చు. 

డిల్లీలో ఈ నిర్భయ ఘటన జరిగినప్పుడు యావత్ దేశప్రజలు, ప్రభుత్వం, న్యాయవాదులు, ప్రజా సంఘాలు అందరూ ఆవేశంతో ఊగిపోయారు. కానీ ఆ తరువాత నిత్యం ఎక్కడో అక్కడ అంతకంటే దారుణంగా చిన్నారులపై కూడా సామూఒహిక అత్యాచారాలు జరుగుతున్నా కనీసం స్పందించడం లేదు. కనుకనే నిత్యం అత్యాచారాలు నిర్భయంగా జరుగుతూనే ఉన్నాయి.