తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల మద్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా చర్చించుకొనేందుకు గవర్నర్ నరసింహన్ సూచనతో ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు మళ్ళీ నిన్న రాజ్ భవన్ లో ఆయన సమక్షంలో సమావేశం అయ్యాయి. కానీ ఈసారి కూడా ఏ సమస్యకు పరిష్కారం కనుగొనకుండానే వారి సమావేశం ముగిసింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున, ఏప్రిల్ 17న మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించుకొన్నారు.
ఏపి సర్కార్ వెలగపూడిలో శాసనసభ భవనాన్ని నిర్మించుకొని ప్రస్తుతం అక్కడే సమావేశాలు నిర్వహించుకొంటోంది గనుక దాని అధీనంలో ఉన్న హైదరాబాద్ లోని శాసనసభ, విధానసభ భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణా రాష్ట్ర మంత్రులు కోరగా, దానిపై తమ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చెపుతామని ఏపి మంత్రులు చెప్పారు.
ఈ సమావేశానికి తెలంగాణా ప్రభుత్వం తరపున మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేకానంద రెడ్డి హాజరయ్యారు. ఏపి సర్కార్ తరపున మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెం నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు.
షెడ్యూల్: 10 పరిధిలోని సంస్థల పంపకాలు, ఉద్యోగుల విభజన, సచివాలయ అప్పగింత, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై వారు ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే సమావేశంలో తప్పకుండా ఏదో ఒక సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం.