మమతా బెనర్జీపై యూపి ఎఫెక్ట్?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా ప్రభావం చూపినట్లున్నాయి. నిత్యం మోడీ ప్రభుత్వంపై కత్తులు దూసే ఆమె, తనంతట తానుగానే రాష్ట్రపతి ఎన్నికలలో భాజపా అభ్యర్ధికి మద్దతు ఇస్తానని ప్రకటించారు. లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ లలో ఎవరికి ఆ పదవి ఇవ్వదలచుకొన్నా తమ పార్టీ భాజపాకు మద్దతు ఇస్తుందని ప్రకటించారు. జూన్ 24తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తుంది. ఆ పదవిని లాల్ కృష్ణ అద్వానీకి గురుదక్షిణగా సమర్పించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మమతా బెనర్జీ తాను తీవ్రంగా వ్యతిరేకించే మోడీ ప్రభుత్వానికి ఈవిధంగా మద్దతు పలకడానికి యూపి ఎన్నికల ఫలితాలేనని భావించవచ్చు. భాజపా నానాటికీ బలోపేతం అవుతుండటం, అదేసమయంలో తృణమూల్ ఎంపిలు, నేతలు వివిధ కుంభకోణాలలో వరుసగా అరెస్ట్ అవుతుండటం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. లేకుంటే ఆమె మోడీ ప్రభుత్వానికి మద్దతు పలుకవలసిన అవసరమే లేదు. ఆమె తమతో చేతులు కలుపకపోయినా ఈ మాత్రం సఖ్యతగా ఉంటే, ఆమె వలన మోడీ ప్రభుత్వానికి ఎదురవుతున్న కొన్ని కష్టాలైనా తగ్గుతాయి.