ఆదిలాబాద్‌కు మహర్దశ: విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్‌

తెలంగాణలో వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్‌కు మహర్దశ పట్టబోతోంది. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ఒప్పందం కుదిరినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు.

ఇప్పటికే గుర్తించిన 1,880 ఎకరాలకు అదనంగా మరో 400 ఎకరాల భూమిని సేకరించే ప్రతిపాదన ఉందన్నారు. మొత్తం 2,280 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మాణం చేపట్టబోతున్నట్లు చెప్పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు మొదలు పెడతామని  తెలిపారు. ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణికుల రాకపోకలకు, కార్గో సేవలకు అనుకూలంగా నిర్మించబోతున్నట్లు తెలిపారు.  

మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి-రాంపూర్ ప్రాంతాల మధ్య ప్రతిపాదిత రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కూడా దాదాపు పూర్తయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. రాబోయే రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

ఈ సిమెంట్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. జిల్లాలోని సున్నపురాయి నిల్వలు పుష్కలంగా ఉన్నందున మరిన్ని సిమెంట్ పరిశ్రమలను జిల్లాకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు.