రేవంత్, కిషన్ కలిసి ఢిల్లీలో డ్రామా: కేటీఆర్‌

మెట్రో రెండో దశ విస్తరణ పనుల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

నేడు శేరిలింగంపల్లి పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు, “మన ప్రభుత్వ హయంలో హైదరాబాద్‌లో 72 కిమీ మేర మెట్రో నిర్మించింది. రెండున్నరేళ్ళ క్రితమే శేరిలింగంపల్లి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి కేసీఆర్‌ భూమిపూజ కూడా చేశారు.

మన తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి ఆ పనులు కొనసాగించి ఉంటే నేడు శంషాబాద్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చి ఉండేది. కానీ రెండున్నరేళ్ళు ఏమీ చేయకుండా పక్కనపడేసి ఇప్పుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారు.

వాళ్ళిద్దరూ మెట్రో నిర్మాణానికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తే, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అంగీకరించినట్లు కొత్త డ్రామా ఆడుతున్నారు.

మనకి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు లేకపోయినా మెట్రో ప్రాజెక్ట్ నిర్మించి చూపాము. కానీ రేవంత్ రెడ్డికి చాతకాక ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారు. 2028లో కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మెట్రో రెండో దశ పనులు పూర్తవుతాయి,” అని కేటీఆర్‌ అన్నారు.