
కల్వకుంట్ల కవిత పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’లో చిన్న మార్పు చేసింది కేంద్ర ఎన్నికల కమీషన్. ఇంగ్లీషులో దానిని ‘టీఆర్ఎస్’ అని యధాతదంగా ఆమోదిస్తూనే ‘రాష్ట్ర సేన’కి బదులు ‘రక్షణ సేన’ అనే పేరుని ఖరారు చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు అందజేసింది.
పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ పేరుతో వేరే పార్టీలు ఉన్నట్లయితే ఆ పేరు లభించదు. కనుక తొలి ప్రాధ్యాన్యత, రెండు, మూడు ప్రాధాన్యతలతో మూడు పేర్లు సమర్పించాల్సి ఉంటుంది. కల్వకుంట్ల కవిత కూడా ఆవిధంగానే సమర్పించారు.
కనుక ‘రాష్ట్ర సేన’ పేరు వేరే వారి పేరిట ఉన్నందున ఆమె ఎంచుకున్న రెండో ప్రాధాన్యత పేరు ‘తెలంగాణ రక్షణ సేన’ని కేటాయించి ఉండవచ్చు. కనుక ఈ కొత్త పేరుతోనే పార్టీ జెండాలు, బ్యానర్లు వగైరా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకులలో ఏవిధంగా ఆసక్తి, ఆత్రుత ఉంటుందో, అదే విధంగా ఈ నెల 25న కల్వకుంట్ల కవిత పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానని చెప్పినప్పుడు ప్రజలు, మీడియా అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
పెద్ద సినిమా థియేటర్లలో రిలీజ్ అయిపోయిన తర్వాత మంచో చెడో టాక్ వస్తుంది. కనుక ఓటీటీలోకి వెళ్ళేలోగా సక్సస్ మీట్లు వగైరాలతో ప్రమోషన్స్ చేసుకుంటారు.
కనుక అదేవిధంగా కవిత కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూపార్టీ ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సి ఉంది. ఆమె భవిష్య కార్యాచరణ ఏమిటో ఇంకా ప్రకటించాల్సి ఉంది.