
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47, ఏకే 47’ షూటింగ్ ముగింపుకు వస్తోంది. ఇలాంటి సమయంలో ఆదర్శ కుటుంబంలో కొన్ని చిన్న మార్పులు చేర్పులు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో తమన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వినగానే అందరూ హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్‌ల ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత తమన్ జాయిన్ అవడం గుర్తు చేసుకుంటున్నారు. కనుక ఈ సినిమాలో కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ అందించేందుకే వస్తున్నారా లేక హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకుంటే పూర్తి సంగీత బాధ్యత తీసుకునేందుకు వస్తున్నారా? అసలు ఈ వార్త నిజమా కాదా? అంటే దర్శక నిర్మాతలు చెప్తే కానీ స్పష్టత రాదు.
ప్రస్తుతం వెంకటేష్, ఇతర ముఖ్య నటులపై హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా షూటింగ్, వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి, జూన్‌లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47లో వెంకటేష్ భార్యగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.