ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సంతోష్ రావుకు నోటీస్

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు నోటీస్ పంపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సిట్ కార్యాలయంలో  ఈ కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. 

ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నవీన్ రావు, హరీష్‌ రావు, కేటీఆర్‌తో మరికొందరు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన సంతోష్ రావుని విచారణకు పిలవడంతో తర్వాత ఎవరి వంతు?అని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

సంతోష్ రావుకి నోటీస్ ఇవ్వడంపై బీఆర్ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీష్‌ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు ఊహించినట్లే స్పందించారు. ఈ కేసు పేరుతో మాపై రాజకీయ కక్ష సాధిస్తున్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ఈ కేసు విచారణ అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్లా కొనసాగిస్తున్నారు. ఇంతమందిని ప్రశ్నించారు. కానీ నేరం జరిగినట్లు నిరూపించలేకపోతున్నారు. 

నేడు గవర్నర్‌ని కలిసి సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణం గురించి వివరించి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా కోరుతాము,” అని బీఆర్ఎస్‌ నేతలన్నారు.