దగ్గుబాటికి ఇదే లాస్ట్ రాకుంటే వారెంట్ జారీ!

దక్కన్ కిచెన్ హోటల్ కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులకు పదే పదే నోటీసులు పంపినా విచారణకు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మాత దగ్గుబాటి సురేష్, అభిరాం, నటులు వెంకటేష్, రానా నలుగురూ ఈసారి తప్పనిసరిగా కోర్టుకి హాజరు కావాలన్నారు. నోటీసులు పంపినా విచారణకు హాజరు కాకపోవడాన్ని కోర్టు ధిక్కారంగానే భావించి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ కేసు విచారాన్ని వాయిదా వేస్తూ ఆ నలుగురికీ ఇదే చివరి అవకాశమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.  

హైదరాబాద్‌లో దక్కన్ కిచెన్ హోటల్ నిర్మించిన స్థలంపై ఆ హోటల్ యజమానికి, దగ్గుబాటి కుటుంబానికి మద్య వివాదం తలెత్తితే, అతని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు ఆ హోటల్ జోలికి వెళ్ళవద్దని, యధాతధ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దగ్గుబాటి సోదరులు జేసీబీతో ఆ హోటల్‌ని పాక్షికంగా కూల్చేశారు. దాంతో ఆ హోటల్ యజమాని వారిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. ఈ కేసులోనే దగ్గుబాటి కుటుంబం విచారణకు హాజరు కాకుండా మళ్ళీ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.