
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తమ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఆయనతో పాటు ఈ కేసులో ఏ-4గా ఉన్న మాజీ డీసీపీ రాదా కిషన్ రావుని కూడా కలిపి ప్రశ్నిస్తున్నారు.
కేసులో ఒక్కరినే విచారిస్తునపుడు వారిని రకరకాలుగా ప్రశ్నించి అనేక వివరాలు రాబడతారు. వారు చెప్పిన విషయాలను సిట్ అధికారులు రికార్డ్ చేసుకుంటారు. తర్వాత వేరేవారితో కలిపి విచారిస్తున్నప్పుడు ఆ వివరాల ఆధారంగా ఇద్దరినీ కలిపి ప్రశ్నిస్తారు.
అప్పుడు మొదట చెప్పిన వివరాలను కాదనలేరు. కనుక ఇద్దరూ లేదా ముగ్గురిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేటప్పుడు సమాధానాలు చెప్పలేక తడబడుతుంటారు. కనుక ఈరోజు జరుగుతున్న విచారణ చాలా కీలకమని భావించవచ్చు.
ఈ కేసులో ఇదివరకు రాధా కిషన్ రావుని ప్రశ్నించినప్పుడు 2023 ఎన్నికలకు ముందు పలువురు ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తారనుకున్నవారి ఫోన్లు ట్యాపింగ్ చేశామని రాధా కిషన్ రావు చెప్పారు.
కనుక ఇదో లొట్టిపిట్ట కేసని వాదిస్తున్న కేటీఆర్, రాధా కిషన్ రావు బయటపెట్టిన విషయాలపై సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టమే కావచ్చు.
ఉదయం 11 గంటలకు కేటీఆర్ సిట్ కార్యాలయంలోకి వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలవుతోందిప్పుడు. ఇంకా విచారణ కొనసాగుతోంది. బహుశః సాయంత్రం వరకు కొనసాగుతుందేమో?