24.jpg)
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు హాజరు కాబోతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. గురువారం రాజన్న సిరిసిల్లా జిల్లాలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసులో నోటీస్ ఇస్తే భయపడే ప్రసక్తే లేదు.
ఇప్పటికే కాళేశ్వరం కేసు, ఎఫ్-1 కేసు, గొర్రెల స్కాం కేసు అంటూ చాలా నడుస్తున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఈ కేసు విచారణ కార్తీకదీపం డెయిలీ సీరియల్లా రెండేళ్ళుగా సాగుతూనే ఉంది. ఇది జస్ట్ టైమ్ పాస్ కేసు మాత్రమే.
మా హయంలో ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఈ కేసు పెట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను తెలుసుకోవడానికి 1952లోనే ఈ విధానం మొదలైంది. అయినా దీంతో ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎటువంటి సంబందమూ ఉండదు. పోలీస్ వ్యవస్థే దీనిని నిర్వహిస్తుంటుంది.
కనుక ముందుగా మా ప్రభుత్వ హయంలో ఇంటలిజన్స్ ఐజీగా చేసి, ప్రస్తుతం డీజీపీగా చేస్తున్న శివధర్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచి అడిగితే ఆయనే అన్ని వివరాలు చెపుతారు కదా?
నేటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిళ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని మేము చెప్తున్నా ప్రభుత్వం, పోలీస్ శాఖ ఖండించలేదంటే అర్థం ఏమిటి?
సిఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని ఎవరు లాక్కుంటారో అని తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు. అందుకే దావోస్ పర్యటనకు వెళుతూ మమ్మల్ని సిట్ విచారణకు పిలిపించాలని ఆదేశించి వెళ్ళారు. తద్వారా అందరినీ ఈ కేసుతో బిజీగా ఉంచుతున్నారు.
రెండేళ్ళుగా ఈ కేసు విచారణ సాగుతున్నా మీడియాకు లీకులు ఇస్తుంటారు కానీ కేసు విచారణలో పురోగతి ఎందుకు లేదు? చివరికి పోలీసులే బలి పశువులు అయ్యే రాజకీయ క్రీడ ఇది,” అని కేటీఆర్ అన్నారు.