మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్

బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కాలే యాదయ్య ఇద్దరూ పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, నేటికీ వారిరువురూ బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారని తమ విచారణ తేలిందని చెప్పారు. కనుక వారిరువురిపై ఎటువంటి చర్యలు అవసరం లేదని స్పష్టం చేశారు. 

మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై కూడా ఎటువంటి చర్యలు అవసరం లేదని తేల్చి చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలనే బీఆర్ఎస్‌ పార్టీ పిటిషన్‌పై విచారణ పూర్తి చేశారు. తీర్పు చెప్పాల్సి ఉంది.     

కడియం శ్రీహరి స్పీకర్ నోటీసుకు జవాబిస్తూ నేటికీ తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నానని తెలిపారు. ఆ పార్టీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం నెలనెలా తన జీతం నుంచి రూ.5,000 కట్ అవుతోందని తెలియజేశారు. ఆ సొమ్ము ఆ పార్టీ ఖాతాలో జమా అవుతోందని తెలిపారు. దానిని ఆ పార్టీ ఏనాడూ తిరస్కరించలేదు కనుక తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని చెప్పేందుకు ఇదే సాక్ష్యమని తెలియజేశారు. కనుక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ ఆయనకీ క్లీన్ చిట్ ఇవ్వడం ఖాయమనే భావించవచ్చు. 

ఇక మిగిలింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరే. ఆయన రాజీనామాకు సిద్ధమని చెపుతున్నారు. ఈ వ్యవహారంలో అయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. కనుక ఒకవేళ సుప్రీంకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. 

పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ని ఆదేశించాల్సిందిగా బీఆర్ఎస్‌ పార్టీ వేసిన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.