తెలంగాణలో మరో విద్యుత్‌ డిస్కం ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్రంలో మరో విద్యుత్‌ డిస్కం ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం నేడు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో పాటు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. తెలంగాణలో సదరన్ అండ్ నార్తర్న్ డిస్కంల కింద గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పధకాలలో భాగంగా ఇచ్చే ఉచిత విద్యుత్‌... ఇలా వివిధ అవసరాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి.

వీటి నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా అవుతున్న వ్యవసాయరంగాన్ని వేరు చేయబోతోంది. అలాగే వివిధ సంక్షేమ పధకాలలో భాగంగా పేదలకు ఇస్తున్న విద్యుత్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలకు విద్యుత్‌ సరఫరా, వినియోగం కూడా ఈ కొత్త డిస్కం ద్వారానే జరుగుతుంది. కనుక అప్పుడు ఉచిత విద్యుత్ కి ఎంత ఖర్చు అవుతోంది? ఎంత కేటాయింపులు జరపాలి? వంటి లెక్కలు పక్కాగా నిర్వహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నిటి కోసం ప్రత్యేకంగా డిస్కం ఉండటం వలన విద్యుత్‌ సరఫరా మెరుగుపరచవచ్చు.

అదే సమయంలో సదరన్ అండ్ నార్తర్న్ డిస్కంలపై ఈ భారం తొలగించడం ద్వారా వాటి పనితీరు కూడా మెరుగుపడుతుంది.