తెలంగాణ తుది పంచాయితీ నేడే

తెలంగాణ పంచాయితీ ఎన్నికలలో నేడు తుది విడత ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎప్పటిలాగే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2  గంటల వరకు  పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ అధ్యక్షతన వార్డు మెంబర్లు సమావేశమై ఉప సర్పంచ్‌ని ఎన్నుకుంటారు. మొదటి రెండు విడతల ఎన్నికలలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు మొదటి, రెండవ స్థానంలో నిలిచాయి.    

నేడు మూడో విడత ఎన్నికలలో 182 మండలాలలో 4,159 గ్రామ పంచాయితీల సర్పంచ్‌లను, 36,452 మంది వార్డు సభ్యులను ఎన్నుకోవలసి ఉంది. కానీ 11 సర్పంచ్‌ పదవులకు, 116 వార్డు మెంబర్ పదవులకు నామినేషన్స్ దాఖలు కాలేదు. మరో 18 వార్డుల ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. 

మిగిలిన వాటిలో 394 సర్పంచ్‌ పదవులు, 7,908 వార్డు మెంబర్స్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. కనుక మిగిలిన పదవులకు నేడు ఎన్నికలు జరుగబోతున్నాయి. 

నేడు జరిగే ఎన్నికలలో 3,752 సర్పంచ్‌ పదవులకు 12,652 మంది, 28,410 వార్డు మెంబర్స్ పదవులకు 75,725 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. 

182 మండలాలలో మొత్తం 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు, 140 ఇతరులు కలిపి మొత్తం  53,06,395 మంది ఓటర్లున్నారు. వీరి కోసం ఎన్నికల సంఘం 36,452 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.