మావోయిస్టులు ఇక చరిత్రలోకే?

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని మావోయిష్టులను నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తోంది. మొదట్లో కేంద్రం హెచ్చరికని లైట్ తీసుకొని సాయుధ దళాలతో పోరాడిన మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 

కనుక రాజకీయ ఒత్తిళ్ళు తెచ్చి ఆపరేషన్ కగార్‌ నిలిపి వేయించాలని మావోయిస్టులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల వేట కొనసాగిస్తుండటంతో ప్రాణాలు దక్కించుకునేందుకు వేలాది మంది ఆయుధాలు అప్పగించి పోలీసులకు లొంగిపోతున్నారు. 

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట నేడు 37 మంది మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. వారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యాల సాంబయ్య అలియాస్ ఆజాద్, సోమ్‌దా అలియాస్ ఎర్ర, నారాయణ అలియాస్ రమేష్ ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మిగిలినవారు ఛత్తిస్‌ఘడ్‌కు చెందినవారని చెప్పారు. 

సిఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నేడు లొంగిపోయిన ప్రతీ ఒక్కరికీ తక్షణ సాయం కింద రూ.25,000 చొప్పున డీజీపీ శివధర్ రెడ్డి అందజేశారు. నేడు లొంగిపోయిన మావోయిస్టులు ఒక్కొక్కరిపై రూ.20 లక్షల చొప్పున రివార్డు ఉంది. కనుక ఆ మొత్తాన్ని వారికే చెల్లిస్తామని, జనజీవన స్రవంతి కలిసిపోయేందుకు ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. 

తెలంగాణకు చెందిన మరో 69 మంది అగ్రనేతలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని వారు కూడా వచ్చి లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.