గ్రామ పంచాయితీ ఎన్నికలకు రిజర్వేషన్స్‌ ఖరారు!

తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికలలో అన్ని వర్గాలకు కలిపి50 శాతం రిజర్వేషన్స్‌ ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ శనివారం జీవో (నం:46) విడుదల చేసింది. దీని కోసం 2011 జనాభా లెక్కలను, ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

ఈ 50 శాతంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్స్‌ ఉండాలని జీవోలో పేర్కొంది. అయితే వీటి కోసం రెండు మార్గదర్శకాలు జారీ చేసింది. మునుపటి పంచాయితీ ఎన్నికలలో రిజర్వ్ చేసిన వార్డులు లేదా గ్రామాలను మళ్ళీ అదే కేటగిరీ కింద రిజర్వ్ చేయరాదని స్పష్టం చేసింది. కానీ 2019 ఎన్నికలలో అమలు చేయలేక పోయిన రిజర్వేషన్స్‌ ఇప్పుడు అమలు చేయవచ్చని జీవోలో పేర్కొంది.

ఈ జీవో ప్రకారం ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకొని రిజర్వేషన్స్ ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని పంచాయితీ రాజ్ శాఖ జీవోలో పేర్కొంది. 

గ్రామ పంచాయితీ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్స్ అని ప్రభుత్వం ఖరారు చేసింది కనుక ఆ ప్రకారమే జిల్లాల అధికారులు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించగానే, ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది.

డిసెంబర్‌ 20వ తేదీలోగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. కనుక త్వరలోనే తెలంగాణలో మళ్ళీ ఎన్నికల కోలాహలం, రాజకీయ పార్టీల సందడి మొదలైపోతుంది.