
ఎఫ్-1 రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపడంతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. ఆ పార్టీ నేతల స్పందన ఊహించినట్లే ఉంది. కానీ ఎఫ్-1 కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన మాత్రం భిన్నంగా ఉంది.
ఈరోజు అయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి సిఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. “తెలంగాణలో అతిపెద్ద భూకుంభకోణం చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి ఓ భారీ కుంభకోణానికి తెర లేపారు. ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫరింగ్ పాలసీ’ పేరుతో హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో భూములను తన అనుచరులకు, అన్నదమ్ములకు, బంధుమిత్రులకు అప్పనంగా కట్టబెట్టేందుకు సిద్దమవుతున్నారు.
దీని ప్రకారం ఎకరం రూ.40-50 కోట్లు పలికే 9,292 ఎకరాల భూములను సొంతం చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ భూముల విలువ సుమారు రూ.4 నుంచి 5 లక్షల కోట్లు ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన కళ్ళు హైదరాబాద్, చుట్టుపక్కల విలువైన భూములపైనే ఉన్నాయి.
గచ్చిబౌలి వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, మూసీనది సుందరీకరణ పేరుతో బద్వేల్ వద్ద భూములు, ఇలా వేల ఎకరాలు కబ్జా చేసేందుకు పావులు కదుపుతున్నారు,” అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
Video Courtesy: Telugu 360