
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించబోతోంది. డిసెంబర్ 10 నుంచి 17 తేదీలలోగా ఎన్నికలు జరపాలని భావిస్తోంది.
ఈ నెల 24న బీసీ రిజర్వేషన్స్- స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు చెప్పబోతోంది. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరదని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేశాయి.
కనుక పాత రిజర్వేషన్స్ ప్రకారం అంటే అన్ని వర్గాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే పంచాయితీరాజ్ శాఖని ఆదేశించింది. ఆ ప్రకారం అది నివేదిక ఇవ్వగానే దానిని ఎన్నికల సంఘానికి అందిస్తుంది.
కనుక ఈ నెల 25 లేదా 26 తేదీలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించేందుకు సిద్దమవుతోంది. తద్వారా బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నిరూపించుకోవాలనుకుంటోంది.