ఈ కొట్లాటలో బీజేపి తప్పించుకుంటోంది!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు ‘జాగృతి జనం బాట’లో భాగంగా ఖమ్మంలో పర్యటించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఈ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల కోట్లాటలతో బీజేపి హాయిగా తప్పించుకు తిరుగుతోంది.

మనం బీజేపికి 8 మంది ఎంపీలను ఇచ్చాము. కానీ వారిలో ఒక్కరు కూడా తెలంగాణ సమస్యలని పార్లమెంటులో కానీ వారి అధిష్టానం వద్దగానీ ప్రస్తావించడం లేదు. పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో పత్తి రైతులు నష్టపోతున్నారు.

కనుక స్థానిక బీజేపి నేతలు, బీజేపి ఎంపీలు ఎవరూ కూడా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పటికైనా వారు కేంద్రంతో మాట్లాడి తేమ శాతం ఎక్కువున్న పత్తికి గిట్టుబాటు ధర ప్రకటింపజేయాలి,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 

ఈ రెండు పార్టీల కోట్లాటల కారణంగా బీజేపి ప్రజా సమస్యలు పట్టించుకోకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదనే కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు అక్షరాల నిజం.

తెలంగాణలో ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేయాలని, అధికారంలోకి  రావాలని బీజేపి కోరుకొంటునప్పుడు, ఏపీ, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు అందిస్తున్నట్లే తెలంగాణకు కూడా సహాయ సహకారాలు అందించాలి కదా?

ఒకవేళ ఈ ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధితో తమకు సంబంధం లేదనుకుంటే ఓట్లు కూడా ఆశించకూడదు. సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే చెపుతున్నారు కదా?