హరీష్ పచ్చి మోసగాడు: కల్వకుంట్ల కవిత

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోవడంపై నిన్న ‘కర్మ రిటర్న్స్’ అంటూ నిన్న క్లుప్తంగా స్పందించిన కల్వకుంట్ల కవిత, ఈరోజు కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరినీ దుమ్ము దులిపేశారు.

హరీష్ రావు పచ్చి మోసగాడని, ఆయనే బీఆర్ఎస్‌ పార్టీని నిలువునా ముంచేస్తున్నారని కవిత ఆరోపించారు.

ఆయనకు నేరుగా సిఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన సూచన ప్రకారమే జూబ్లీహిల్స్‌ అభ్యర్ధి ఎంపిక చేశారని కవిత ఆరోపించారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావుతో సహా బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ప్రభుత్వోద్యోగాలు ఇప్పించడానికి రూ.2-3 లక్షల చొప్పున వసూలు చేసుకునేవారన్నారు. 

హరీష్ రావుని నమ్ముకొని తన అన్న కేటీఆర్‌ కూడా ఎదురుదెబ్బలు తింటున్నారని, అందుకు కృష్ణార్జునులమని చెప్పుకుంటున్నారని కానీ ఒకరిపై మరొకరు బాణాలు వేసుకుంటూ ఆధిపత్యపోరులో మునిగిపోయారన్నారు ఇద్దరూ పార్టీని పట్టించుకోకపోవడం వలన బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తలు తన వద్దకు వస్తున్నారని కవిత చెప్పారు. 

ఈ ఉప ఎన్నికలో నామినేషన్స్ వేసిన 15 మందిని తాను హరీష్ రావు వద్దకు పంపితే ఆయన వారి మద్దతు అవసరమే లేదని పంపించేశారని కవిత చెప్పారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి రోడ్లు వేయించలేదని, అనర్హులకు ఇళ్ళు కేటాయించారని, మిషన్ భగీరధతో వారానికి ఒకటి రెండు రోజులే నీళ్ళు వస్తున్నాయంటూ ఆమె ప్రజా సమస్యలను ఏకరవు పెడుతూనే ఉన్నారు. వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫిబ్రవరి 13 వరకు ఆమె జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలోగా బీఆర్ఎస్‌ పార్టీని నిలువునా చీల్చేసినా ఆశ్చర్యం లేదు.