
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపి ఘోర పరాజయం పాలవడంపై ఘోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ముగ్గురూ కలిసి రాష్ట్రంలో బీజేపిని భ్రష్టు పట్టించేస్తున్నారు.
కాంగ్రెస్ మంత్రులు, నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు పోరాడితే, ఈ ముగ్గురు నాయకులు బీజేపి అభ్యర్ధిని కలిసి ఓడించాలన్నట్లు పని చేశారు. ముగ్గురిలో ఎవరు ఈ ఓటమికి బాధ్యత వహిస్తారు?
ఈ ఉప ఎన్నికలోనే గెలవలేకపోతే త్వరలో జరుగబోయే గ్రేటర్ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఏమిటి? ఈ లెక్కన పార్టీ తీరు ఉంటే తెలంగాణలో బీజేపి ఎన్నటికీ అధికారంలోకి రాలేదు.
నాకు వాళ్ళ ముగ్గురిపై వ్యక్తిగతంగా కోపం, ద్వేషం లేవు. కానీ పార్టీని భ్రష్టు పట్టించేస్తున్నారనే ఆవేదనతోనే ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా మా అధిష్టానం మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాను,” అని రాజా సింగ్ అన్నారు.
బీజేపి అధిష్టానం దృష్టి పెడితే ఘన విజయం సాధించగలదని బీహార్ శాసనసభ ఎన్నికలలో నిరూపితమైంది. కానీ పట్టించుకోకపోతే ఓటమి తప్పదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిరూపితమైంది కదా?