మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‌

హైదరాబాద్‌ నగరానికి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇప్పుడు మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కాబోతోంది. సుమారు 450 ఎకరాలలో విస్తరించి ఉన్న మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసింది.

రూ.319.24 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు క్లియర్ చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అధారిటీ దీని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంది. 

మీర్ ఆలం చెరువు తూర్పు వైపుగల శాస్త్రిపురం నుంచి పశ్చిమం వైపు గల చింతల్ మెట్ వద్ద బెంగళూరు జాతీయ రహదారితో కలుపుతూ దీనిని నిర్మించబోతున్నారు. సుమారు 2.5 కిమీ పొడవు,16.5 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో ఈ  కేబుల్ బ్రిడ్జి నిర్మించబోతున్నారు.

దీనిని రెండేళ్ళలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం ముందే గడువు విధించింది. కనుక ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న కేఎన్ఆర్‌ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఆ ప్రాంతంలో భూమి చదును చేసే పనులు కూడా మొదలుపెట్టింది.