జూబ్లీహిల్స్‌ పోలింగ షరా మామూలే!

రాష్ట్రంలో అత్యంత ధనవంతులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న ప్రాంతం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం.

సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉంటే మధ్యాహ్నం 3 గంటల వరకు వారిలో 40.20 శాతం మంది మాత్రమే వచ్చి ఓట్లు వేశారు.వారిలో సినీ సెలబ్రేటీలు, రాజకీయ ప్రముఖులు, నిరుపేదలే ఎక్కువ మంది ఉన్నారు.

ఉన్నత విద్యావంతులు, ఐటి ఉద్యోగులు ఎప్పటిలాగే పోలింగ్ రోజున సెలవు వాడుకున్నారు కానీ వచ్చి ఓట్లు వేయలేదు.

మరో గంటన్నరలో అంటే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తవుతుంది. ఆలోగా వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కనుక మిగిలిన ఈ గంటన్నరలోనైనా విద్యావంతులు వస్తారా? అనుమానమే!

రాజమౌళి వంటి క్షణం తీరిక లేని బిజీ డైరెక్టర్ కూడా వచ్చి ఓటు వేశారు. కానీ ఐటి ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం చాలా శోచనీయం.

క్లబ్బులు, పబ్బులు, సినిమాలు, షాపింగులకు వారాంతపు సెలవుల్లో విహారయాత్రలకు వెళ్ళగలుగుతున్నప్పుడు, సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయడానికి బద్ధకం, నామోషీ దేనికి? ఓటు వేయనివారు ప్రభుత్వాన్ని, దాని నిర్ణయాలను, విధానాలను విమర్శించేందుకు అనర్హులే కదా?