భారీ భద్రత మద్య జూబ్లీహిల్స్‌ పోలింగ్ షురూ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.          నిన్న ఢిల్లీ పేలుడు ఘటన నేపధ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా నివారించేందుకు రెండు వేల మంది పోలీసులను మొహరించి, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. పోలీస్ శాఖ 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా సిద్ధంగా ఉంచింది.  

జూబ్లీహిల్స్‌ సీటు కోసం మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో సహా మొత్తం 58 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. వారి కోసం ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిలో 139 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ మరింత మంది పోలీసులను మోహరించింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు నియోజకవర్గంలో 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు.   

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో కేవలం సగం మంది అంటే 50.18 శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, 2018 ఎన్నికలలో 45.49 శాతం, 2023 ఎన్నికలలో 45.59 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించింది. కానీ నిన్న ఢిల్లీ పేలుడు నేపధ్యంలో ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకుంటారో?