తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గోల్కొండ కోటలో మువ్వన్నెల జండా ఎగురవేసి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. కనుక గోల్కొండ కోటను మువ్వన్నెల దీపాలతో అందంగా అలంకరించారు. గోల్కొండ కోట, పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.
ఈరోజు ఉదయం 9.55 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట వద్దకు చేరుకుంటారు. ప్రధాన ద్వారం వద్దనే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి రాణీ మహల్ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై జాతీయ పతాకం ఎగురవేస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన 25 మందికి సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా పతకాలు ప్రధానం చేస్తారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనబోతున్నారు. కనుక భారీగా పోలీసులను మొహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.