ప్రధాని మోడీకి తెలంగాణ సిఎం రేవంత్ వార్నింగ్!

అవును. తెలంగాణ సిఎం ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్స్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మోడీజీ! మిమ్మల్ని సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నా. మీరు మా బీసీ రిజర్వేషన్స్‌ ఆమోదిస్తారా లేక మిమ్మల్ని గద్దె దించామంటారా? చెప్పండి.

మేము గల్లీలో కొట్లాడితే మీకు వినపడదని నేరుగా ఢిల్లీకి వచ్చి ఇక్కడే కొట్లాడుతున్నాము. మీరు బీసీ రిజర్వేషన్స్‌ ఇస్తే ఆ గౌరవం మీకు లభిస్తుంది. లేకుంటే వచ్చే ఎన్నికలలో మీ పార్టీని ఓడించి మిమ్మల్ని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసుకొని బీసీ రిజర్వేషన్స్‌ సాధిస్తాం. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.

బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయమని మేము కోరుతుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు? మీకా ఉద్దేశ్యం లేదు కనుకనే!

తెలంగాణలో 8 మంది బీజేపి ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ ఎవరూ తెలంగాణ బీసీల కోసం నోరు విప్పడం లేదు. బీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణతో పేగు బంధం తెంచేసుకుంది. కనుక దానికీ బీసీ రిజర్వేషన్స్‌ సాధించాలనే ఆలోచన లేదు,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 

బీసీ రిజర్వేషన్స్‌ కోసం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఈ పోరాటంలో కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సైతం ఒప్పించడంతో కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టగలిగారు. కేసీఆర్‌ ఏ అంశంపై పోరాడినా ఇంత మంది మద్దతు కూడగట్టలేకపోయారు. కనుక ఖచ్చితంగా ఈ క్రెడిట్ సిఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది.