ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్‌ పార్టీ వేసిన పిటిషన్లపై సుదీర్గ విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు చెప్పింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ ఆగస్టీ జార్జ్ మసీహ్ లతో కూడిన  ధర్మాసనం మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది.

వారిపై సుప్రీంకోర్టు స్వయంగా అనర్హత వేటు వేయాలనే బీఆర్ఎస్‌ పార్టీ పిటిషన్‌ని తిరస్కరించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఫిరాయింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులపై ఇంత విచారణ జరుపాల్సిన అవసరం లేకుండా పార్లమెంటు చట్టం చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

బీఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు: 1.దానం నాగేందర్ (ఖైరతాబాద్‌), 2.కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), 3.పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్స్‌వాడ), 4.అరెకెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), 5.తెల్లం వెంకట్రావు (భద్రాచలం), 6.గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), 7.బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల్), 8.ప్రకాష్ కుమార్ గౌడ్‌ (రాజేంద్ర నగర్‌), 9.కాలే యాదయ్య (చేవెళ్ళ), 10.ఎం.సంజయ్ కుమార్ (జగిత్యాల్).