బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాజేంద్ర నగర్ పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం రేవంత్ రెడ్డి నా భార్య ఫోన్‌తో సహా మా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారు.
ఇటీవల మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ అందాల భామల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారు. కొందరు కాంగ్రెస్ మంత్రులు వారితో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవాడినే. కనుక రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఎన్ని దేశాలలో తిరిగారో, అక్కడ ఏమేమి తప్పుడు పనులు చేశారో నాకు బాగా తెలుసు. కనుక రేవంత్ రెడ్డి మా జోలికి వస్తే ఆయన బండారం బయటపెడతాను,” అని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేసినందుకు రాజేంద్ర నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా పోలీసులు పలు సెక్షన్స్ కింద పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఆయనపై ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కొండాపూర్‌లోని ఆయన నివాసం ఉంటున్న కొల్లా లగ్జరీస్‌పై దాడి చేయవచ్చని ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. ఈ విషయం తెలిసి పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొంటుండటంతో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోపక్క రాజేంద్ర నగర్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డికి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేందుకు ఏర్పట్లు చేసుకుంటున్నారు.