బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి

జూబ్లీహిల్స్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆదివారం తెల్లవారుజామున ఏఐజీ హాస్పిటల్‌లో కన్నుమూశారు.

నాలుగు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చేర్చగా వైద్యులు ఆయన సీపీఆర్ చేసి బ్రతికించారు. కానీ అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్న ఆయనని వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు నిన్ననే చెప్పారు. వారు చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. 

మాగంటి గోపీనాధ్ రాజకీయాలలోకి రాక మునుపు సినీ నిర్మాతగా ఉండేవారు. తొలిసారిగా 2014లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరి 2018,2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. 

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అమెరికా నుంచి తిరిగి రాగానే నిన్న రాత్రి హరీష్ రావు, ఇతర బిఆర్ఎస్ నేతలతో కలిసి హాస్పిటల్‌కు వెళ్ళి గోపీనాధ్ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు మాగంటి గోపీనాధ్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.