
సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించి రూ.1051.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనాలు చేశారు. వీటిలో తుర్కపల్లి మండలంలో గంధమల్ల జలాశయం పనులకు రూ.574 కోట్లు, యాదగిరి గుట్టలో కొత్తగా నిర్మించబోతున్న ప్రభుత్వాసుపత్రికి రూ.183 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించారు.
ఈ సందర్భంగా తిరుమలాపురంలో జరిగిన బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “యాదగిరిగుట్టకి టీటీడీ తరహా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాము. గుట్టలో గోశాల, భక్తులకు వసతి సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. గుట్టలో ఒక విశ్వవిద్యాలయం, విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాము.
గతంలో కేసీఆర్ యాదగిరిగుట్ట అభివృద్ధి పేరుతో కమీషన్లు తినేసి స్వామివారి పట్ల చాలా అపచారం చేశారు. అందుకే ముఖ్యమంత్రి పదవి ఊడిపోయి ఫామ్‌హౌస్‌లో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవగానే తుంటి ఎముక విరిగింది. బిఆర్ఎస్ పార్టీలోనే దెయ్యాలున్నాయని ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత చెప్పారు. అదో దెయ్యాల పార్టీ. ఆమె చెప్పిన ఆ దెయ్యాలు ఎవరో కేసీఆర్ చెప్పాలి.
గతంలో ప్రధాని పీవీ నరసింహారావుగారికి ఓ సెషన్స్ కోర్టు నోటీస్ ఇస్తే విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ తప్పు, అవినీతి జరుగలేదని వాదిస్తున్నప్పుడు విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు?
గతంలో కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను తొడగొట్టి సవాలు చేసి కేసీఆర్‌ని గద్దె దించి ఈ కుర్చీలో కూర్చున్నాను. బంగారి తెలంగాణ పేరుతో కేసీఆర్ చేసిన అవినీతి, అప్పులు చేసి రాష్ట్రాన్ని బొందల తెలంగాణగా మార్చేస్తే, మళ్ళీ గాడిన పెట్టేందుకు కృషి చేస్తున్నాను.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా ప్రతీ నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాము. తెలంగాణని మళ్ళీ అభివృధ్ది పధంలో నడిపించేందుకు మేము ప్రయత్నిస్తుంటే, ఫామ్‌హౌస్‌లో పడుకొని మా ప్రభుత్వంపై అడ్డమైన విమర్శలు చేయిస్తూ, మా ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.
మరో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రం మళ్ళీ గాడిన పడదు. కనుక బిఆర్ఎస్ నేతల దుష్ప్రచారం నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.