కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే: ఈటల

మాజీ ఆర్ధిక మంత్రి, బీజేపి ఎంపీ ఈటల రాజేందర్‌ శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టుకి కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే. ఆర్ధిక శాఖ ప్రమేయం నామ మాత్రమే. ఈ ప్రాజెక్టుకి సంబందించి అన్ని నిర్ణయాలు కేసీఆర్, హరీష్ రావులే తీసుకునేవారు. కనుక సమాచారం అంతా వారి వద్దనే ఉంది. 

హరీష్ రావు నేతృత్వంలో రీడిజైనింగ్ కమిటీ ఖరారు చేసిన నిర్ణయాల ప్రకారం మేడిగడ్డ వద్ద బ్యారేజ్‌ నిర్మించడం జరిగింది. మొదట రూ.63,000 కోట్లు అంచనా వెయ్యగా తర్వాత వివిద కారణాల చేత అది రూ.82,000 కోట్లకు పెరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల విషయంలో హరీష్ రావు నేతృత్వంలోని నీటిపారుదల శాఖ అన్ని నిర్ణయాలు తీసుకునేది. కనుక వాటితో ఆర్ధికశాఖకు సంబంధం లేదు. 

ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తూ విచారణకు ఈ కమీషన్ ఏర్పాటు చేసింది కనుక నివేదిక చేతికి వచ్చిన తర్వాత దానిని రాజకీయాలకు ఉపయోగించుకోకుండా, బయటపెట్టి అవినీతికి పాల్పడినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నేను ప్రస్తుతం బీజేపిలో ఉన్నా నిజమే చెపుతాను తప్ప నా కణతపై తుపాకీ గురిపెట్టినా అబద్దం చెప్పాను,” అని ఈటల రాజేందర్‌ అన్నారు.