నేడు కాళేశ్వరం కమీషన్ విచారణకు ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ ఎదుట నేడు మాజీ ఆర్ధిక మంత్రి, ప్రస్తుత బీజేపి ఎంపీ ఈటల రాజేందర్‌ హాజరు కానున్నారు. ఈయన తర్వాత ఈ నెల 9న మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, 11న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమీషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కనుక ఇంతవరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అనుకుంటే నేటి నుంచి జరుగబోయే విచారణ మరో ఎత్తు అని చెప్పవచ్చు. 

దాదాపు 12 నెలలుగా విచారణ జరుపుతున్న కమీషన్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఉన్నతాధికారిని, ఇంజనీర్‌ని, కాంట్రాక్ట్ కంపెనీ ఇంజనీర్లను ప్రశ్నించి అనేక వివరాలు రాబట్టింది. ఆ వివరాల ఆధారంగా వీరి ముగ్గురినీ ప్రశ్నించబోతోంది. 

ముందుగా వీరు ముగ్గురూ తమ వివరణ ఇచ్చుకునేందుకు అవకాశమిచ్చి, వారు చెప్పడం పూర్తయిన తర్వాత ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురిని ప్రశ్నించిన తర్వాత అవసరమైతే మళ్ళీ అధికారులను పిలిపించి ప్రశ్నించి మరిన్ని వివరాలు సేకరిస్తుంది. ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.