భారత్-పాక్ మద్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అన్ని రాష్ట్రాలలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇటువంటి సమయంలో సిఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి మంగళవారం రాత్రి పిలుపు రావడంతో బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం.
కనుక భారత్-పాక్ ఘర్షణ-పర్యావసనాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించేందుకు కాదని అర్దమవుతోంది. బహుశః మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చించేందుకు కావచ్చు.
మంత్రివర్గంలో మరో ఆరుగురుని తీసుకునే అవకాశం ఉంది. కానీ పార్టీలో పలువురు మంత్రి పదవులకు పోటీ పడుతున్నందున చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొని ఉంది. కనుక మంత్రివర్గ విస్తరణ వాయిదా వేస్తుండటంతో పదవులు ఆశిస్తున్నవారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనుక మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలో ఖరారు చేసేందుకే సిఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించి ఉండవచ్చని తెలుస్తోంది.
ఒకవేళ దీని కోసమే అయితే ఓ పక్క దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఇప్పుడా? అనే ప్రశ్న వినిపించకుండా ఉండదు.