
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-6 నిందితుగా ఉన్న ఓ ప్రముఖ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావుకి సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నమోదుకాగానే అమెరికా పారిపోయి అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు.
ఆయనని తిరిగి రప్పించేందుకు సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది కనుక హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక మద్యంతర బెయిల్ కోరుతూ ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.
శ్రవణ్ రావుకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఆయన 48 గంటలలో అమెరికా నుంచి తిరిగి వచ్చి విచారణకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు సుప్రీంకోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు.
దానిపై న్యాయమూర్తులు సానుకూలంగా స్పందిస్తూ మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. కానీ శ్రవణ్ రావు తప్పనిసరిగా హైదరాబాద్ తిరిగివచ్చి ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని షరతు విధించారు. ఈ కేసు తదుపరి విచారణని ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.
మద్యంతర బెయిల్ మంజూరు చేస్తే హైదరాబాద్ తిరిగివచ్చి విచారణకు సహకరిస్తారని హామీ ఇచ్చినందున, పంజగుట్ట పోలీసులు వెంటనే హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్ళి, ఈ నెల 29న అంటే నేడు విచారణకు హాజరు కావాలని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు నోటీస్ ఇచ్చారు. కనుక ఆయన ఈరోజు ఉదయమే హైదరాబాద్ చేరుకొని విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబందించి మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంది.