మార్చి 27 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు

తెలంగాణ శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ నెల 27వరకు తెలంగాణ శాసనసభ బడ్జెట్‌  సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు (గురువారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చించానున్నారు.

శుక్రవారం హోళీ పండుగ సందర్భంగా శాసనసభకు సెలవు ఉంటుంది. శనివారం సభ నిర్వహించి మళ్ళీ ఆదివారం సెలవు తీసుకుంటారు. 

ఆ తర్వాత (16,23 తేదీలు) ఆదివారాలు మినహా మార్చి 27 వరకు శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతాయి.

ఈ నెల 15,17,18 తేదీలలో శాసనసభలో కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ బిల్లుల తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఈ నెల 19న 2025-26 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఒకవేళ ఈసారి శాసనసభ బడ్జెట్‌ చర్చలకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ కూడా హాజరైతే సమావేశాలు మరింత వాడివేడిగా సాగవచ్చు. లేకుంటే కేసీఆర్‌ని వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూ శాసనసభలో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లభిస్తుంది.