పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రా పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏపీ ఫిలిమ్ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించేవారు. ఆ సమయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి చాలా అనుచితంగా మాట్లాడేవారు. 

ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్‌లో కొందరు వ్యక్తులు పిర్యాదు చేశారు. ఆ కేసు గురించి ఆంధ్రా పోలీసులు రాయదుర్గం పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి, ఆయనని బుధవారం రాత్రి రాయదుర్గంలోని మైహోం  భుజా అపార్ట్‌మెంట్‌ నుంచి అరెస్ట్‌ చేసి ఏపీకి తరలించారు. పోసానిపై సెక్షన్స్ 196,353 (2), 111 రెడ్ విత్ 3(5)కింద కేసు నమోదు చేసిన్నట్లు ఏపీ పోలీసులు తెలిపారు. 

పోలీసులు తనని అరెస్ట్‌ చేసేందుకు వచ్చినప్పుడు పోసాని కృష్ణ మురళి కొంతసేపు వారితో వాగ్వాదం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రా పోలీసులు ఆయనని గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఓబులవారి పల్లె తరలించి, వైద్య పరీక్షలు చేయించిన తర్వాత రాజంపేట కోర్టులో హాజరుపరచనున్నారు. 

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా అనుచితంగా మాట్లాడినందుకు ఆయనపై కూడా ఆంధ్రా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.