సర్వే అంటే మమ అనిపించడం కాదు...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వేపై ప్రతిపక్షాల విమర్శలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగి వచ్చి ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్ళీ సర్వే జరిపిస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో సర్వే చేయకుండా మొదటి సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోని ప్రతీ ఒక్కరి ఇంటికీ వెళ్ళి వివరాలు సేకరించి నమోదు చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ప్రభుత్వానికి సూచించారు. 

ఓటర్ కార్డ్, ఆధార్ కార్డుల ప్రకారం చూసినా రాష్ట్ర జనాభా 4.10 కోట్లు ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని అన్నారు. కానీ మొదటి సర్వేలో రాష్ట్రంలో 3.55కోట్లు మంది వివరాలు మాత్రమే నమోదు చేయడాన్ని ఆర్‌. కృష్ణయ్య తప్పు పట్టారు. 

ఇన్ని లక్షల మంది వివరాలు నమోదు చేయకుండా సమగ్ర సర్వే అని ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. ఈసారైనా ప్రతీ ఇంటికీ వెళ్ళి శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆర్‌. కృష్ణయ్య సూచించారు. 

రాష్ట్రంలో బీసీ జనాభాయే ఎక్కువ ఉందని ప్రభుత్వం చెపుతున్నప్పుడు బీసీ సంఘాలతో ప్రమేయం లేకుండా ఏవిదంగా సర్వే నిర్వహించారని ప్రశ్నించారు. ఈసారైనా బీసీ సంఘాల నేతలను సంప్రదించి వారి సహాయ సహకారాలతో ప్రతీ బీసీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆర్‌. కృష్ణయ్య హితవు పలికారు.