నేడు చేవెళ్ళలో బిఆర్ఎస్ రైతుదీక్ష

ఎఫ్-1 రేసింగ్ కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చిక్కుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. కనుక పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం పెంచి మళ్ళీ కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోరాడేందుకు కేటీఆర్‌ కార్యాచరణ సిద్దం చేశారు. ఈరోజు చేవెళ్ళలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగబోయే రైతుదీక్షలో కేటీఆర్‌ పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా రైతుల తరపున ఈ దీక్ష చేయబోతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి చేవెళ్ళ చేరుకొని రైతుదీక్షలో పాల్గొంటారు. కానీ రైతుదీక్షకు పోలీసులు అనుమతించారా లేదా అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఒకవేళ అనుమతించకపోతే కేటీఆర్‌ని హైదరాబాద్‌లోనే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. 

ఎఫ్-1 రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ ఒకదాని తర్వాత మరొకటి కేటీఆర్‌ని ప్రశ్నించాయి. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి పంపించేశాయి. కనుక త్వరలోనే మళ్ళీ కేటీఆర్‌కి పిలుపు వచ్చే అవకాశం ఉంది.

కనుక ఆలోగా ఇటువంటి రాజకీయ కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే, తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారనే విషయం కూడా ప్రజలకు చెప్పుకోవడం ద్వారా ఒకవేళ అరెస్ట్‌ అయితే ప్రజల సానుభూతి లభిస్తుందని కేటీఆర్‌ ఆలోచన అయ్యుండవచ్చు.