ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారం కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి సుప్రీంకోర్టు కూడా షాక్ ఇచ్చింది. ఆయన ‘ఇదో పనికిమాలిన ‘లొట్టిపీసు కేసు’ అని ఎంత తేలికగా కొట్టివేస్తున్నప్పటికీ, హైకోర్టు ఆయన మాటలు నమ్మలేదు. సుప్రీంకోర్టు కూడా నమ్మలేదు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు, నేడు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది.
ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ జరిపి ఈ కేసులో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటిషన్ కొట్టేశారు.
ఈ కేసులో ఉపశమనం పొందేందుకు సుప్రీంకోర్టు చివరి అవకాశం. కానీ సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో, ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఏదైనా జరిగే అవకాశం ఏర్పడింది. ముందుగా కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు హాజరు కావలసి ఉంది.
మొన్న ఏసీబీ విచారణకి పిలిచినప్పుడే అరెస్ట్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ప్రశ్నించి పంపించేసింది. ఇదో లొట్టిపీసు కేసని కేటీఆర్ చెపుతున్నారు కనుక ఇప్పుడు ఈడీ కూడా అలాగే ప్రశ్నించి పంపించేస్తుందా లేక అరెస్ట్ చేస్తుందా? ఈడీ సూచన మేరకే ఏసీబీ అరెస్ట్ చేయకుండా కేటీఆర్‌ని విడిచిపెట్టేసిందా?అనే ప్రశ్నలకు రేపు సమాధానం లభించవచ్చు.