సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం విద్యాసాగర్ రావు ఆత్మకధ ‘ఉనికి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రసంగంలో బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. అధికార, ప్రతిపక్ష 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే శాసనసభ. అందరూ కలిసి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై శాసనసభలో లోతుగా చర్చించాలి. లోపాలేమైనా ఉంటే చర్చలలో బయటపడుతుంది. కనుక శాసనసభ సమావేశాలలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో సహా అందరూ పాల్గొనాలని కోరుతున్నాను.
వారి అనుభవం, సలహాలు, సూచనలు మాకు చాలా అవసరం. ఏదైనా విషయంలో ఎవరి సలహాలు స్వీకరించడానికైనా నాకు ఎటువంటి నామోషీ ఫీల్ అవను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు, వారి అభిప్రాయాలు తెలియజేసేందుకు తగినంత సమయం ఇస్తున్నామే తప్ప ఎవరినీ సభలో నుంచి బహిష్కరించలేదు. ప్రతిపక్షాలకు మా ప్రభుత్వం సముచిత గౌరవం ఎప్పుడూ ఇస్తుంది,” అని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాల గురించి మాట్లాడుతూ, “రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కనుక తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని నేను ప్రధాని మోడీని కలిసినప్పుడు కోరాను. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఇంకా కొన్ని అనుమతులు తెచ్చుకోవలసి ఉంటుంది.
ఇతర రాష్ట్రాలలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి తమ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటారు. ఆదేవిదంగా తెలంగాణలో బీజేపి ఎంపీలు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్షం మరియు పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం.
: "ఉనికి" పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి గారు. pic.twitter.com/CwaxAwKMnm