హైడ్రా కూల్చివేతలు ఓ పక్క తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం భగవద్గీత స్పూర్తితోనే కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
హైదరాబాద్‌లో హరేకృష్ణ సంస్థ అనంత శేషశాయి పేరుతో 430 అడుగుల ఎత్తు ఉండే ఓ టవర్ నిర్మిస్తోంది. నేడు దాని భూమిపూజా కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడం పూర్వ జన్మ సుకృతంగానే భావిస్తున్నాను. మూడేళ్ళలో ఈ టవర్ నిర్మాణం పూర్తికాగానే మళ్ళీ మనమే ప్రారంభించుకుందాము. హైదరాబాద్ నడిబొడ్డున ఇటువంటి గొప్ప కట్టడం నిర్మిస్తుండటం రాష్ట్రానికే గర్వకారణం,” అని అన్నారు.
తర్వాత హైడ్రా కూల్చివేతల గురించి మాట్లాడుతూ, “నగర ప్రజల దాహార్తిని తీర్చగల చెరువులని కొందరు ప్రముఖులు కబ్జాలు చేసి విలాసవంతమైన ఇళ్ళు నిర్మించుకున్నారు. ప్రకృతి సంపదని నాశనం చేస్తే అది మనపై ఏవిదంగా విరుచుకుపడుతుందో చెన్నైలోని వరదలు, వయనాడ్‌లోని భీభత్సం తెలియజేశాయి.
కనుక ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే భగవత్గీత స్పూర్తిగా చెరువులు, నాలాలలో దురాక్రమణలు తొలగించి మళ్ళీ యధాస్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ ప్రయత్నంలో ఎన్ని ఒత్తిళ్ళు వస్తున్నా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. మొదలుపెట్టిన పని మద్యలో ఆపేదే లేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కనుక మరిన్ని భవనాలు కూలబోతున్నాయని భావించవచ్చు. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే భూకబ్జాలు జరిగాయా... ఇతర జిల్లాలలో జరుగలేదా? మరి వాటి సంగతి ఏమిటి? సిఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది.