హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారబోతోంది. ఈరోజు శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రతిపాదన చేస్తూ, “పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరుని బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీ పేరు మార్చాలనుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం మాకు కలిగింది. దీనికి సభలో అధికార, ప్రతిపక్షాలు అందరూ అంగీకరిస్తే ముందుకు వెళతాము లేకుంటే లేదు.
ఆయన తెలంగాణ సాహిత్యానికి, దాని ద్వారా ఉద్యమాలకు చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుంది. కనుక మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బిఆర్ఎస్ పార్టీ సభ్యులు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారో లేదో చెపితే చాలు,” అని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీతో సహా శాసనసభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకి మద్దతు ఇచ్చారు. కనుక త్వరలోనే యూనివర్సిటీ పేరు మార్పుకి అవసరమైన చర్యలు చేపడతామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.