హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలలో నానాటికీ జనాభా, వాహనాల రద్దీ పెరిగిపోతున్నందున ఈ మూడింటికి ధీటుగా రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం, బేగరికంచె వద్ద మరో కొత్త నగరం నిర్మిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా అక్కడ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి నిన్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తదితరులు కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ జరిగిన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఇంతవరకు బేగరికంచె అంటే ఎవరికీ తెలియదు. కానీ రాబోయే నాలుగున్నరేళ్ళలో ఇక్కడ ఓ అద్భుతమైన నగరం నిర్మించబోతున్నాము. ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యం అవుతాయి. కనుక ఫార్మా సిటీ స్థానంలో అంతర్జాతీయ ప్రమాణలతో కొత్త నగరం నిర్మించబోతున్నాము.
దీనిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, క్రికెట్ స్టేడియం, కార్పొరేట్ హాస్పిటల్స్, ఐటి కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటవుతాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెట్రో రైలుని ఇక్కడి వరకు పొడిగిస్తాము.
భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇక్కడే కమ్యూనిటీ సెంటర్ పేరుతో కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ళు కట్టించి ఇస్తాము. వారి పిల్లలకు కార్పొరేట్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేస్తాము. నిర్వాసితులకు ఇళ్ళు, విద్యా, వైద్యం, ఉద్యోగాలు అన్ని అందించే బాధ్యత మా ప్రభుత్వానిదే. భవిష్యత్లో బేగరికంచె పేరు మారుమ్రోగిపోతుంది,” అని అన్నారు.