కేటీఆర్‌ చెప్పారని మేడిగడ్డ నింపితే చాలా ప్రమాదం: ఉత్తమ్

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగస్ట్ 2లోగా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్‌ చేసి గోదావరి వరద నీటిని ఎత్తిపోసి ఎగువన గల జలాశయాలలో నింపాలని, లేకుంటే తామే 50 వేల మంది రైతులను వెంటబెట్టుకొని వచ్చి మోటర్లు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోసుకుంటామని హెచ్చరించడాన్ని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తప్పు పట్టారు.  

“ఆనాడు మేడిగడ్డ బ్యారేజిలో నీటిని నిలువచేస్తే బ్యారేజికి ప్రమాదం ఏర్పతుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ (ఎన్‌డిఎస్ఎ) హెచ్చరించినందునే కేసీఆర్‌ అన్ని గేట్లు ఎత్తించి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి కేటీఆర్‌కు తెలియన్నట్లు మాట్లాడుతున్నారు. ఎన్‌డిఎస్ఎ కంటే కేటీఆర్‌ తానే తెలివైనవాడినని అనుకుంటున్నారా?

ఆయన మాట విని మేము మేడిగడ్డ బ్యారేజిలో నీటిని నిలువ చేస్తే బ్యారేజి కూలిపోతే  సమక్క బ్యారేజి కూడా కొట్టుకుపోతుంది. అదే కనుక జరిగితే ఏటూరు నాగారం కూడా ప్రమాదంలో పడుతుంది. భద్రాచలంతో పాటు 40 గ్రామాలు నీట మునుగుతాయి. 

అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ గోడలకు భారీగా పగుళ్ళు ఏర్పడి నీళ్ళు లీక్ అవుతున్నాయి. వాటిలో నీటిని నింపితే అవి కూడా ప్రమాదంలో పడతాయి. అందుకే గేట్లు మూయకుండా నీటిని విడిచిపెడుతుందాలని ఎన్‌డిఎస్ఎ చెప్పింది. 

కనుక కేటీఆర్‌ బెరింపులకు భయపడి మేము మేడిగడ్డ బ్యారేజిలో నీరు నిలువ చేయము. ఎన్‌డిఎస్ఎ చెపితేనే చేస్తాము. 

ఎల్లంపల్లిలో ప్రాజెక్ట్ నిర్మిస్తే కేవలం రూ. 38 వేల కోట్లు ఖర్చుతో పూర్తయ్యేది. అక్కడ నుంచి ఒకే ఒక లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసుకుంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు పారేవి. కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని తప్పుని కేసీఆర్‌ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడే కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించి తండ్రీ కొడుకులు వేలకోట్లు దండుకున్నారు. 

అయినా వాడకానికి పనికిరాని విదంగా నాసిరకంగా నిర్మించి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. పైగా కేటీఆర్‌ సిగ్గులేకుండా ఈవిదంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్‌ మా ప్రభుత్వాన్ని బెదిరించడం కాదు... చేసిన తప్పులు ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి,” అని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు.